సినిమా కళ

వైరల్ వీడియోల మ్యాటరేంటి ?

viral-videosవీడియోలని వీక్షించడం, నెట్వర్క్ లో షేర్ చేసుకోవడం ఉదయాన్నే బ్రష్ చేసుకోవడమంత దిన చర్యగా మారిపోయిన విషయం తెలిసిందే.  ఈ వీడియోల్లో వైరల్ వీడియోలు అనేవి షార్ట్ ఫిలిమ్స్ కంటే ముందు నుంచే మందు కొట్టినంత కిక్ ని ఇస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏ మాత్రం ఫాలోయింగ్ తగ్గకుండా షార్ట్ ఫిలిమ్స్ వ్యూయర్ షిప్ ని తలదన్నుతున్నాయి.  మొత్తం భూగోళాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ లాగా ఓ స్క్రిప్టూ,  ప్లానింగూ అంటూ అవసరంలేని వీటిని  చిన్న పిల్లలు కూడా తీసి యూట్యూబ్ లో పెట్టేయవచ్చు.  ఇంట్లో చేసే వెర్రి మొర్రి  చేష్టల కాడ్నుంచీ,  రోడ్డు మీద జరిగే ఏ ఆసక్తికర సంఘటనైనా సెల్ ఫోన్తో తీసి అప్ లోడ్ చేస్తే చాలు- అది వైరల్  వీడియోగా ప్రపంచం మొత్తాన్నే షేక్ చేసేయవచ్చు. విష జ్వరాల్ని వైరల్ ఫీవర్ అంటూంటాం. అలాగే ప్రజల్లో గంగవెర్రులెత్తిస్తూ ఆన్ లైన్లో విష జ్వరంలా వ్యాపించే వీడియోలనే వైరల్ వీడియోలు అంటున్నాం!

ఇవి నవ్విస్తాయి, ఏడ్పిస్తాయి, భయపెట్టిస్తాయి, ఆలోచింప జేస్తాయి- ఇంకేమైనా చేస్తాయి. పరిమితుల్లేవు. ఇంటర్నెట్  ప్రధాన స్రవంతి కాక మునుపు, యూట్యూబ్ కూడా అందుబాటులోకి రాక ముందు వరకూ,  ఇవి ఈ మెయిల్స్ ద్వారా వైరల్ ఫీవర్ తెప్పించేవి. ఇలా 1995 అమెరికాలో  ‘ది స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్’  మొట్ట మొదటి వైరల్ వీడియో అయ్యింది. మాట్ పార్కర్, టెర్రీ స్టోన్ అనే ఇద్దరు రూపొందించిన షార్ట్ యానిమేషన్ అది. 8 ఎం. ఎం. కెమేరాతో దీన్ని రూపొందించారు. ఇది ఈ మెయిల్స్ ద్వారా అసంఖ్యాక  వీక్షుకులకు చేరి కొత్తొక వింత అన్నట్టు కుర్ర బుర్రల్ని క్రాకెత్తించింది.

1996 లో  ‘డాన్సింగ్ బేబీ’  అనే మరో యానిమేషన్ రెండో  వైరల్ వీడియోగా చరిత్రలో  నమోదయ్యింది.  ఈ మెయిల్స్ లో, వెబ్ ఫోరమ్స్ లో, వెబ్ సైట్స్ లో, కమర్షియల్ యాడ్స్ లో, టీవీ సిట్ కామ్స్ లో…ఇక్కడ చూసినా  దీని జ్వరంతో  వేడెక్కి పోయిన ప్రేక్షకులే!

2005 కి వస్తే, ముగ్గురు పేపాల్ మాజీ ఉద్యోగులు చాడ్ హార్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీం లు ‘యూ ట్యూబ్’ ని స్థాపించారు. ఒకసారి ఈ ముగ్గురూ పాల్గొన్న ఒక డిన్నర్  పార్టీ  వీడియో తీసినప్పుడు- వీడియోల్ని షేర్ చేసుకునే మార్గం లేదే అన్న ఆలోచన తట్టింది. ఇదే యూ ట్యూబ్ సృష్టికి నాంది పలికింది. అలా శాన్ డియాగో  ‘జూ’ లో యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావెద్ కరీం దిగిన వీడియో ఏప్రెల్ 23, 2005 న మొట్ట మొదటి సారిగా యూ ట్యూబ్ లో అప్ లోడ్ అవుతూ ‘యూట్యూబ్’ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫాం కి శ్రీకారం చుట్టింది.

అప్పట్నుంచీ వీడియో షేరింగ్ చాలా ఈజీ అయిపో యింది. ఇదే ఇప్పుడు ఎడాపెడా వైరల్ వీడియోల ప్రసారాలకి ప్రధాన కేంద్ర మయింది. డిజిటల్ కెమెరాలు అందుబాటు లోకి రావడంతో అవధుల్లేకుండా పోయింది. అయితే ఒక వీడియో వైరల్ వీడియో అని ఎప్పుడన్పించు కుంటుంది? దీనికో నిబంధన వుంది. కొన్నేళ్ళ క్రితం వరకూ పదిలక్షల వ్యూస్ వుంటే వైరల్ వీడియో అని నిర్ణయించే వారు. ఇప్పుడు 3 నుంచి 7 రోజుల్లో 50 లక్షల వ్యూస్ ఉంటేనే వైరల్ వీడియో అవుతుందని డిసైడ్ చేశారు. ఇవి అనేక విధాలుగా పాపులర్ అవుతున్నాయి. మార్కెటింగ్ సాధనంగా ఉపయోగ పడ్డం దగ్గర నుంచీ సామాజిక సమస్యల్ని ఎత్తి చూపే ఆయుధంగా అనేక రూపాల్లో ఆన్ లైన్ లోకంలో చక్కర్లు కొడుతున్నాయి. యూనివర్సల్ అప్పీల్ వుంటే వీటికి విశేష పాపులారిటీ దక్కుతోంది. 2007 నుంచి ఇప్పటివరకూ పాపులారిటీ ఛార్ట్ లో మోనార్క్ లా నిలబడ్డ ఒకే ఒక్క వైరల్ వేదియో వుంది. అది ‘చార్లీ బిట్ మై ఫింగర్ ఎగైన్’ అనేది. దీని తాజా కౌంట్ 45 కోట్ల వ్యూవ్స్! ఒకే ఒక్క నిమిషం నిడివి గల ఈ క్లిప్పింగ్ రికార్డుని బ్రేక్ చేసే వీడియో ఇక రాదేమో!

వైరల్ వీడియోలు  మూడు నిమిషాల కి మించి నిడివి వుంటే ఆకట్టుకునే అవకాశాలు తక్కువ. క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా వుండే వైరల్ వీడియోలు ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విరివిగా షేర్ అవుతూంటాయి. ఎమోషన్స్ ని రెచ్చ గొట్టే వీడియోలే వైరల్ వీడియోలుగా విశ్వరూపం ప్రదర్శిస్తాయి. ఇందాకే చెప్పుకున్నట్టు ఫలానా ఈ విధంగా ఉంటేనే వైరల్ వీడియో అవుతుందన్న రూలు లేదు గనుక- ఆ మధ్య  ధనుష్ పాడిన ‘కొలవరి’ సాంగ్ వీడియో సైతం వైరల్ గా ఆన్ లైన్లో ప్రభంజనం సృష్టించింది. దీనిని  ‘ఇండియా టుడే’ అప్పట్లో దేశంలో అత్యంత పాపులర్ వైరల్ వీడియోగా పేర్కొంటూ స్పెషల్ స్టోరీ రాసింది. ఈ మధ్యే మన హైదర బాద్ కి చెందిన మంజులతా కళానిధి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సృష్టించిన సరదా వైరల్ ‘ఐస్ బకెట్’ కి సామాజిక కర్తవ్యం టచ్ ఇస్తూ ‘రైస్ బకెట్’ అనే వీడియో తీసి ఫేస్ బుక్ లో పెడితే, అది వైరల్ లా వ్యాపించి ఆన్ లైన్ లో విస్తృతంగా షేర్ అవడమేగాక, మరెందర్నో అటువంటి సేవకి పురిగొల్పింది. అవసరంలో వున్న వారికి బియ్యాన్ని దానమిచ్చే సేవ!

పదిమాటలతో ఇచ్చే సందేశాన్ని ఒక్క దృశ్యంతో ఇవ్వొచ్చు! ఇదే వైరల్ వీడియోల గొప్పతనం. సినిమా సందేశాలు ఇలా కార్యాచరణకి పురిగొల్పిన సందర్భాలు దాదాపు వుండవు. యువత వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ వ్యాపకాలతో తలమునకలై వుంటారు. వాళ్ళ హృదయాలకి గురి చూసి కొట్టాలంటే- వాళ్ళ ప్రపంచంలోకి వెళ్లి అటువంటి సాధనాలని ఎక్కు పెట్టాల్సిందే. అదే వైరల్ వీడియోల నే సాధన- ఆయుధ- భాండాగారం!

ఇక గమ్మత్తు వీడియోల విషయం చెప్పక్కర్లేదు. నార్త్ కరోలినాలో ఒక పెద్ద మనిషి తన కూతురు ఫేస్ బుక్ లో అసభ్య పోస్టింగ్ చేస్తూండగా చూశాడు. అంతే, దాంతో రివాల్వర్ తీసి ఆ లాప్ టాప్ ని షూట్ చేసి పారేశాడు! ఈ వీడియో మూడుకోట్ల నలభై మంది వ్యూయర్స్ ని ఆకట్టుకుంది. ‘కోనీ- 2012’ పేరుతో  ఇంకో వైరల్ తొమ్మిది కోట్ల వ్యూయర్స్ తో సంచలనం రేకెత్తించింది. ఇది ప్రచార వీడియో. ఉగాండా కు చెందిన మిలిటరీ అధికారి జోసెఫ్ కోనీ మరోసారి మానవ హననానికి పాల్పడకుండా అడ్డుకోండని పిలుపు నిచ్చిన వైరల్ వీడియో ఇది!

షార్ట్ ఫిలిమ్స్ కి టాలెంట్ అవసరం, వైరల్ వీడియోకి ఏదీ అవసరం లేదు- కెమెరా వుంటే చాలు. సరదా వుంటే సరదా తీర్చుకోవచ్చు, సీరియస్ విషయం చెప్పాలనుకుంటే అదీ చెప్ప వచ్చు- ఏమైనా చేయవచ్చు, అయితే అడల్ట్ కంటెంట్ నిషిద్ధం. హింస విషయానికి వస్తే, బహిరంగంగా జరుతున్న నేరం,  అడ్రసు అడుగుతున్న యువతిని చితకబాదుతున్న పోలీసు దాష్టీకం లాంటివి వ్యవస్థ చర్య తీసుకునేందుకు సాక్ష్యంగా వైరల్ వీడియో బాధ్యత నెరవేర్చవచ్చు!

-వీనస్ 
 

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16