స్క్రీన్ ప్లే సంగతులు

వంగవీటి

ఎవరెలా చేశారు
ప్రతివొక్కరూ బాగా నటించారు. ఇందులో రెండో మాటకి తావులేదు. కాకపోతే వాళ్ళ పాత్రల్నే వర్మ పైపైన తడిమి వదిలెయ్యడంతో సజీవ పాత్రలుగా మాత్రం కన్పించరు.  ఉన్నంత వరకూ పాత్రల్ని అద్భుతంగా నటించారు. అందరూ కొత్త ముఖాలే, ఒక్క లాయర్ పాత్రధారి తప్ప. దీంతో ఫ్రెష్ ఫీలింగ్ కన్పిస్తుంది. కొత్తవాళ్ళయినా నటింప జేసుకోవడంలో వర్మ ఎప్పుడూ విఫలమవలేదు.  సోదరులు రాధా, రంగా రెండు పాత్రల్నీ సమర్ధవంతంగా పోషించాడు సందీప్ కుమార్. ముఖ్యంగా సౌమ్యంగా కన్పించే రంగా పాత్రలో ప్రధానంగా దృష్టిని ఆకర్షిస్తాడు.  ఇక అచ్చం నెహ్రూ లాగే వున్న శ్రీతేజ్ ఇంకొక హైలైట్. చలసాని వెంకటరత్నం (విజయవాడ రాజకీయాల్లో ఇంకో వెంకటరత్నం వుండేవారు- కాంగ్రెస్ మంత్రీ, గొప్ప నాయకుడూ అయిన కాకాని వెంకటరత్నం) పాత్రలో వంశీ నెక్కంటి విచిత్ర  మ్యానరిజమ్స్ ని ప్రదర్శించాడు షార్ట్ టెంపర్ వ్యక్తిత్వంతో. గాంధీగా కౌటిల్య, మురళీగా వంశీ చాగంటి, రత్నకుమారిగా నైనా గంగూలీ కూడా కొత్త వాళ్లన్పించనంత ఈజ్ తో నటించుకు పోయారు. ఈ సినిమా బలహీనత అంతా కూడా కొట్టొచ్చి నట్టు కన్పించే పాత్రల మధ్య కుల సమీకరణలని నిర్వచించక పోవడం దగ్గరే వుంది. నగరంమీద ప్రారంభమైన ఆధిపత్య పోరు కాస్తా కులాధిపత్య పోరుగా పరిణమించి, అంతిమంగా దాని ఫలితాలు అమాయక ప్రజలెలా చవిచూశారో  చెప్పక దాట వెయ్యడంలోనే వుంది…. రత్నకుమారి పాత్ర కేంద్ర బిందువుగా- ఆలంబనగా దీన్ని పకడ్బందీగా చూపించుకు రావొచ్చు.  ఈ పని చేయలేదు. కానీ ఈమె తన స్వకులస్థులైన దేవినేని వర్గీయులనే చంపేందుకు భర్తని ప్రోత్సహించినట్టు చూపించారు. ఇది వర్మ చేసిన కల్పనే అయితే,  ఇది ‘మాక్బెత్’ సూత్రాల ప్రకారం కూడా చాలా తప్పు. అధికారంలో వున్న భర్తని భార్య హత్యలకి ప్రోత్సహిస్తోందంటే ఆమెకి సొంత ఎజెండా ఉండొచ్చు. ఆ హత్యా పరంపరలో భర్త రాలిపోతే, ప్రియుడితో కలిసి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని. ‘మాక్బెత్’ చేసే హెచ్చరిక ఇదే (ఇంకా కావాలంటే ‘మాక్బెత్’ ఆధారంగా విశాల్ భరద్వాజ్ తీసిన ‘మక్బూల్’ చూడొచ్చు). కానీ వర్మ చూపించిన ‘భార్య’ పాత్రకి ఇలాటి సొంత ఎజెండాలు కన్పించవు. ఆమె నిజాయితీతోనే వుంటుంది. కానీ ఎలాంటి నిజాయితీ? తను ప్రేమిస్తున్న రంగాతో ఇంట్లో పెళ్ళికి వొప్పుకోకపోతే, ఇల్లొదిలి వచ్చేసిన తనని దేనినేని సోదరులు, తల్లీ  తమ ఇంట్లో పెట్టుకుని రంగాకి నచ్చ జెప్పి పెళ్లి జరిపించారు. అలాటి సహృదయుల పైన భర్తని  ఎలా ఎక్కుబెడుతుందామె? మధ్య వర్తిత్వం నెరపి ఉద్రిక్తతల్ని సడలింప జేయొచ్చుగా? అంత నెగెటివ్ రోల్ ప్లే చేసిన పాత్ర చివరికి ఏం సాధించింది? పే ఆఫ్ కాని  పాత్ర ప్రవర్తనని వూరికే సెటప్ చేయడమెందుకు?

ఇక దేవినేని సోదరులే తమ కులస్థురాల్ని కాపు కులస్థుడైన రంగాకి నచ్చ జెప్పి పెళ్లి జరిపించినట్టు చూపించినప్పుడు,  ఇది డ్రమెటిక్ సందర్భం వాళ్ళ నిజజీవితాల్లో కూడా. కులాంతర వివాహంతో ముడిపడిన ఈ డ్రమెటిక్ సందర్భమే ఆ తర్వాత వాళ్ళ మధ్య అన్ని సంఘర్షణల్లోనూ వర్మ గుర్తు చేయాలి నిజానికి – చరిత్ర మీద కామెంట్ చేయబూనిన ఒక దర్శకుడైతే. ఏదీ దాచకుండా చరిత్రని ఎత్తి చూపించి ప్రశ్నించి నప్పుడే ఇలాటి సినిమాల్లో దర్శకత్వ నిబద్ధత కనబడేది. దేనికో వెరచి, ఎందుకో సందేహపడి తటస్థ వైఖరిని వదులుకుంటే అది రాజకీయనాయకుడి లక్షణమౌతుంది.  చరిత్ర బ్యాడ్ జర్నలిజమని ఇందుకే అని ఉంటాడు జోసెఫ్ క్యాంప్ బెల్. ఇది నిజం చేశారు వర్మ. అంత నిర్భయంగా ట్వీట్లు చేసే వర్మ,  సినిమాలో తన సహజ శైలి ఫీట్లు చేయక, నిమ్మకు నీరెత్తి నట్టుండిపోయారు- మొక్కుబడి యాక్షన్ థ్రిల్లర్ చూపించేస్తూ.  పోస్టర్ల మీద ‘కాపు కాసే శక్తి’ అని కులప్రస్తావన తెచ్చినంత స్వేచ్ఛగా కథలో తిరుగాడలేక పోయారు వర్మ. కాదనలేని ఈ కులాల కోణాన్ని కథకి ఆత్మగా చేసుకుని వుంటే, అదే ఎమోషనల్ థ్రెడ్ గా మారి అద్భుతం చేసివుండేది ఈ సినిమాకి. ఈ కథలో మొదట కులాలకతీతంగా వున్నపాత్రలు ఎలా దిగజారిపోయాయో ఒక బలమైన ముద్రతో చెప్పే వీలుండేది. చరిత్రని ఉన్నదున్నట్టో, అసమగ్రంగానో, అర్ధసత్యాలతోనో చూపించి చేతులు దులుపుకోకుండా, ఆ చరిత్ర సృష్టించిన మనుషులు మిస్సయ్యిందేమిటో,  అది ఎత్తి చూపిస్తూ సమాజానికో హెచ్చరిక పంప గలగాలి. తన యుక్త వయస్సు నుంచీ ఈ హింసారి రంసని గమనిస్తూ వచ్చానంటున్న వర్మ- ఒక్క మాటలో ఈ చరిత్ర మీద తన అభిప్రాయమేమిటో చెప్పి ఉండాల్సింది. రిపోర్టింగ్ చేయడం అభిప్రాయం చెప్పడం కాదు. ఒక్కో హత్య జరిగినప్పుడల్లా వర్మ తన వాయిస్ తో  వ్యాఖ్యానాలు చేయడం కథని ముందుకు నడిపించే మంచి టూల్ గానే ఉపయోగపడింది గానీ, ఒక్కోసారి అదే కర్ణక ఠోరంగా పరిణమించిన  మాట కూడా నిజం. అలాగే ఎమోషన్లు పెంచడానికి సెకండాఫ్ లో వరుసగా బ్యాక్ గ్రౌండ్ లో తన స్టయిల్ లో పెట్టిన అరుపుల పాటలతో ఆయా విష పరిణామాలని చూపించడం కూడా పైపైన వేసిన పూతే.  ఎమోషన్ అనేది కథలో వుండే పాయింటు లోంచి కదా పుట్టాలి. ఆ పాయింటు పాత్రలు విస్మరిస్తున్న అంతకి ముందున్న సెక్యులరిజమే. పాయింటుతో కట్టి పడెయ్యకుండా సినిమాని నిలబెట్టడం కష్టం. ‘షిండ్లర్స్ లిస్ట్’ అనే స్పీల్ బెర్గ్ తీసిన నాజీల చరిత్రలో- విలాసవంతంగా జీవిస్తూండే వ్యాపారవేత్త, ఎందుకని లక్షాలాది మంది యూదుల్ని తన సొంత ఖర్చుతో నాజీల ఊచకోత నుంచి తప్పిస్తూ పొరుగు దేశాలకి తరలిస్తూ పోయాడు? కేవలం తనలో మేల్కొన్న మానవత్వం కారణంగానే! ఈ మానవత్వమనే పాయింటే  సినిమాకి ఆత్మ అయింది. అక్షయ్ కుమార్ నటించిన ‘ఏర్ లిఫ్ట్’ లో కూడా ఇంతే. ఎన్ని ఇజాలు పెట్టుకున్నా అవన్నీ మానవిజం కిందే వుంటాయి.  సినిమాలో మాటలు పొట్టిగా సూటిగా బలంగా బావున్నాయి. టెక్నికల్ గా కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ వున్నాయి. ఒకే సీన్లో రాధాని చంపే ముందు,  షాపు ముందు వుండే తడి నేల, వెంటనే పొడి నేలగా కన్పిస్తుంది. టీడీపీ పార్టీ అవిర్భవించినట్టు డైరెక్టుగా పసుపు జెండాలు చూపించకుండా కాస్త కాషాయంగా వుండే పతాకాలు చూపించారు.  అదే నెహ్రూ ఎన్నికల ప్రచారంలో అవికాస్తా ఒరిజినల్ తెలుగుదేశం పసుపు పచ్చ జెండల్లా బస్తీమే సవాల్ గా రెపరెప లాడుతున్నాయని చూసుకోలేదేమో కాస్ట్యూమ్స్ అతను- ఆర్ట్ డైరెక్టర్ కూడా. లొకేషన్స్ పరంగా ఆనాటి  విజయవాడని పకడ్బందీగా చూపించారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాలు వ్యూలోకి రాకుండా ఏరియల్  షాట్స్ మేనేజ్ చేశారు. అలాగే ఒక్కో హత్యా దృశ్యాల సెటప్ ని – యాక్షన్స్ నీ అద్భుతమైన సస్పెన్సుతో క్రియేట్ చేస్తూ పోయారు. మురళిని చంపేటప్పుడు ఓపెనయ్యే లారీ బాడీలో, ముందు కత్తులూ కటార్లూ టపటప వచ్చి పడే సీను ఒక మార్వెలస్ క్రియేషన్.

స్క్రీన్ ప్లే సంగతులు

వర్మ ఫ్లాష్ బ్యాకుల జోలికి పోరు- అదే ఈ స్క్రీన్ ప్లేకి పెద్ద మైనస్. కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్స్ ని డిమాండ్ చేసే కథిది. అప్పుడే ఏకత్రాటి పైకి కథ రావడమే గాక, ఒకే పాత్ర ఆధారంగా కథని నడిపించడానికి వీలవుతుంది. సినిమా కథ ఎప్పుడూ ఒక్క పాత్రదే అయ్యుంటుంది. మిగిలిన పాత్రలు ఆ ఒక్క పాత్ర కథలో అంతర్భాగంగా వుంటాయి. కారణాలేవైతేనేం, పెట్టుకున్న టైటిల్ ప్రకారం వంగవీటి రంగా కథగా చూపించదల్చు కోలేదు వర్మ. అందులో అంతర్భాగంగా దేవినేనిల కథనీ చెప్పదల్చుకోలేదు. కానీ వంగవీటి సోదరులు లేకపోతే దేవినేని సోదరులే లేరు. ఇంకా చెప్పాలంటే వెంకటరత్నం లేకపోతే ఇంకెవరూ లేరు, ఈ చరిత్రే లేదు. ఇప్పుడు పనిగట్టుకుని వంగవీటి రంగా జీవిత చరిత్ర తీయడం, అందులో ఆయన్ని ప్రజాబాంధవ్యుడిగా చిత్రించడం వర్మ చేసేపని కూడా కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తి ఆరాధనకి దూరం. ఎవరి భజనా చెయ్యరు. ఇది మంచిదే. కానీ స్క్రీన్ ప్లే కి ఏది మంచిది? చరిత్రలో ఎవరికీ ప్రాధాన్య మివ్వకుండా అందరి జీవితాలనీ కలిపి డాక్యుమెంటేషన్ చేస్తే అది సినిమా స్క్రీన్ ప్లే అవతుందా? కథలతో అపార అనుభవమున్న వర్మ కివన్నీ తెలీవని కాదు, తెలీదన్నట్టు ఇలా రాయడం కూడా మంచిదికాదు. కానీ ఫలితం సినిమాటిక్ అనుభవానికి భిన్నంగా వచ్చింది. సినిమా స్క్రీన్ ప్లేని వదిలేసి డాక్యుమెంటేషన్ చేస్తూ డాక్యూ డ్రామా చేశారు కాబట్టే అనేక సార్లు మధ్య మధ్యలో తన వాయిసోవర్ తో వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చింది. ఇదంతా సినిమాటిక్ అనుభవాన్ని దెబ్బ తీసింది. ఒకే పాత్ర- ఒక లక్ష్యం అన్నట్టుగా ఉంటేనే కదా స్క్రీన్ ప్లే అన్పించుకునేది. రాసుకున్నవన్నీ స్క్రీన్ ప్లేలు అయిపోవుగా. వివాదం ఎప్పుడు వుంటుంది? రెండు వర్గాలున్నప్పుడే. వివాదాస్పద కథల జోలికెళ్ళి నప్పుడు-రెండు వర్గాల్నీ బ్యాలెన్స్ చేయాల్సి వుంటుంది. ఆ బ్యాలెన్సింగ్ కోసం అందర్నీ కలిపేసి డాక్యుమెంటేషన్ చేస్తే సినిమా అవదు. ‘గాంధీ’ జీవిత చరిత్రతో సినిమా ఎలా తీయాలన్నప్పుడే అటెన్ బరోకి అమల్లో వున్న స్క్రీన్ ప్లే సూత్రాల్ని తనకోసం కస్టమైజ్ చేసుకోవాలన్పించింది. లేకపోతే గాంధీ జీవితంలో జరిగిన ఎన్నో మహత్తర సంఘటనల్ని ఒక కథగా చెప్పడం కుదరదు. ఆయన జీవితంలోంచి నాల్గే ఘట్టాలు- దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా జీవితం, అవమానం, అందులోంచి లక్ష్యం; భారత్ కి తిరిగి వచ్చి ఆ లక్ష్య సాధనకోసం సహాయ నిరాకరణోద్యమం, మతకలహాలు, మరణం- ఇలా విభజించుకుని స్క్రీన్ ప్లే చేస్తే, అది సమగ్ర రూపంలో గాంధీ జీవితంలా వచ్చింది.

‘వంగవీటి’ ని ఇలా చేయాలనీ కాదు, రెండు వర్గాలున్నప్పుడు వంగవీటి ని హైలైట్ చేస్తే అది వివాదాస్పదం కావొచ్చు. పైగా వ్యక్తి ఆరాధన కూడా కావొచ్చు. అందుకే ఇలా జరక్కుండా టైటిల్ ఒకటిగా, సినిమా ఇంకొకటిగా తీశారు. ఇలాకాకుండా స్క్రీన్ ప్లే చట్రంలోకి వచ్చి, ఒకే పాత్ర- ఒకే లక్ష్యం అనుకుని, ఈ సూత్రాన్ని అవసరానికి తగ్గట్టుగా సినిమాటిక్ అనుభవంతో, కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకే పాత్ర (వంగవీటి)- ఒకే లక్ష్యం (దేవినేనిలు), ఒకే పాత్ర (దేవినేని నెహ్రూ)- ఒకే లక్ష్యం (రంగా). ఇలా ఇద్దరి వేర్వేరు వ్యవహారాల డైనమిక్స్ ని సమాంతరంగా రన్ చేయడం. ఓపెనింగ్ మురళి మర్డర్ తో. దీంతో నెహ్రూ దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్- తాము రంగా బ్యాచిలో చేరినప్పట్నించీ మురళి మర్డర్ వరకూ- రాజకీయాల్లోకి వచ్చాక తాను సాధించిన విజయాలూ కలుపుకుని. అటు రంగా దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్- వెంకటరత్నం దగ్గర్నుంచీ తన అన్న మర్డర్, దాంతో తాను బాస్ అయిన విధం వరకూ- – రాజకీయాల్లోకి వచ్చాక తాను సాధించిన విజయాలూ కలుపుకుని. ఇప్పుడు ఇద్దరి సమగ్ర రూప మేర్పడింది, ఎవరేమిటో స్పష్టమైన ముఖ చిత్రం కళ్ళకి కట్టింది. ఇక క్లయిమాక్స్…రంగా మరణం, నెహ్రూ అరెస్ట్, అల్లర్లు, ఎండ్ టైటిల్స్ తో కేసు పరిణామాలు వగైరా. వర్మ ఒక్కో హత్యని ఒక్కో ప్లాట్ పాయింటుగా పెట్టుకుంటూ పోయారు. బిగినింగ్ విభాగంలో రాధా ఎదుగుదలలో భాగంగా వెంకటరత్నం మర్డర్ వేశారు. తర్వాత రాధా మర్డర్ తో ప్లాట్ పాయింట్ వన్ ని తెచ్చి, బిగినింగ్ ని ముగిస్తూ రంగాని ముగ్గులోకి దింపారు. ఇప్పుడు మిడిల్ ప్రారంభిస్తూ దేవినేనిలతో సంఘర్షణ పుట్టించి, ఇంటర్వెల్లో దేవినేని గాంధీ మర్డర్ వేశారు. మళ్ళీ ఈ మిడిల్ ని కంటిన్యూ చేస్తూ సెకండాఫ్ లో, ప్లాట్ పాయింట్ టూ గా, మురళీ మర్డర్ వేశారు. దీనితర్వాత రంగా మర్డర్ తో క్లయిమాక్స్. ఇలా చేయడం వల్ల గుంపుగుత్తగా రెండు వర్గాల కథల్నీ కలగాపులగం చేసినట్టయ్యింది. దీంతో చూసేవాళ్ళకి ఆటోమేటిగ్గా ఎవరు హీరో, ఎవరు ఈ కథ నడిపిస్తున్నారూ అన్న సైకలాజికల్ కనెక్షన్ సంబంధ గడబిడ మొదలయింది. ఈ మొత్తాన్నీ పైన చెప్పుకున్న విధంగా, కస్టమైజ్ చేసుకుని వుంటే, ఆ విడి విడి కథల్లో ఇద్దరూ హీరోలుగానే కన్పించే వాళ్ళు – ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అన్నది ప్రేక్షకులకే వదిలేస్తూ.
-సికిందర్

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16