స్క్రీన్ ప్లే సంగతులు

మిడిల్-2 నిర్మాణం నిజాలు 

గత వ్యాసంలో  51 వ సీనులో మల్లి హత్యోదంతంతో ఎత్తుకుని, 78వ సీన్లో గణేష్ ని శివ పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు పడెయ్యడంతో 27 సీన్లతో మిడిల్-2 విభాగం ముగిసింది. మిడిల్ -2 విభాగం ముగియడమంటే ప్లాట్ పాయింట్ -2 ఏర్పడ్డమే.  మిడిల్ -1 విభాగం ఫస్టాఫ్ లో 22 వ సీన్లో క్యాంటీన్లో శివా అతడి గ్రూపూ ఎలక్షన్స్ గురించి చర్చించుకుంటూ, భవానీ మనిషి జేడీ మీద శివ పోటీ చేయాలని గ్రూపు అంటే,  కాదని నరేష్ ని నిలబెడదామని శివ అనడంతో ప్రారంభమవుతుంది. అది ప్లాట్ పాయింట్ -1.  అంటే అక్కడ్నించీ ప్రారంభమయ్యే మొత్తం మిడిల్ విభాగం సెకండాఫ్ లో గణేష్ ని శివ పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు పడేసే 78వ సీను దగ్గర ప్లాట్ పాయింట్- 2 గా ముగుస్తుందన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ -1 కీ, ప్లాట్ పాయింట్- 2 కీ మధ్య  మొత్తం మిడిల్ విభాగం నిడివి 56 సీన్లతో వుందన్న మాట.  ఇది మొత్తం స్క్రీన్ ప్లే లో 50 శాతంగా  ప్రమాణాల ప్రకారమే  వుంది.
ఇప్పుడు  మిడిల్ -2 నిర్మాణం  ఎలా జరిగిందో చూద్దాం : ఈ 27 సీన్లూ రెండు సీక్వెన్సులుగా ఏర్పడ్డాయి. మొదటి సీక్వెన్స్ టాపిక్ భవానీని చంపడంగా కాకుండా,భవానీ  లాంటి వాళ్ళని సృష్టిస్తున్న వ్యవస్థని నాశనం చేయడం; రెండో సీక్వెన్స్ టాపిక్ వచ్చేసి మల్లి హత్య కేసులో నిందితుడైన గణేష్ ని పట్టుకోవడం. ఈ రెండు టాపిక్స్ తో ఈ రెండు సీక్వెన్సులూ నడుస్తాయి. టాపిక్స్ నిర్ణయించుకుంటే సీక్వెన్సులు నడపడం సులభం. ఈ టాపిక్స్ థీమ్ తో (కాన్సెప్ట్ తో) మమేకం అవాలి.
ఇక్కడ రెండు సీక్వేన్సుల ప్రారంభాలకీ  52, 57 సీన్లలోనే బీజాలు పడ్డాయి. 52 వ సీన్లో శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడంతో, దీనికి మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని  తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనే మొదటి టాపిక్ తో, మొదటి సీక్వెన్స్ కి బీజం పడింది.
అలాగే 57 వ సీన్లో, మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ భవానీతో నానాజీ  అనే మాటగా రెండో టాపిక్ తో, రెండో సీక్వెన్సుకి బీజం పడింది.
కానీ రెండు సీక్వెన్సులూ ఈ రెండు టాపిక్స్ తో ఏకకాలంలో సమాంతరంగా నడవలేదు. అలా నడిపి వుంటే చాలా గజిబిజి అయ్యదే. ఇప్పుడు  చాలా సినిమాల్లో సీక్వెన్సుల విధానం తెలీక టాపిక్స్ ని గజిబిజి చేసి నడిపిస్తున్నారు. ‘శివ’ లో ఎత్తుకున్న మొదటి టాపిక్ తో మొదటి సీక్వెన్స్ ని ముగించాకే, రెండో టాపిక్ ని ఎత్తుకుని  రెండో సీక్వెన్స్ ని నడిపారు.
పై వన్ లైన్ ఆర్డర్ లో మొదటి టాపిక్ కి సంబంధించిన సీన్స్ ని గమనిస్తే – 55,56,57,58,59,60,61,62,63,67,71 సీన్లలో వ్యవస్థని నాశనం చేసే మొదటి టాపిక్ తాలూకు విషయం ప్రవహిస్తుంది. మొదటి టాపిక్ ఎత్తుకున్న 52 వ సీనుతో కలుపుకుని మొత్తం 13 సీన్లుగా మొదటి సీక్వెన్స్ నడుస్తుంది. 52 వ సీనులో వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడంతో మొదలై, 71 వ సీనులో ఆ  వ్యవస్థకి మూలపురుషుడైన మాచి రాజు, భవానీ దగ్గర కొచ్చేసి క్లాసు పీకడంతో మొదటి సీక్వెన్స్ కొలిక్కొస్తుంది.
ఈ మొదటి సీక్వెన్సు  నడిచే 52- 71 సీన్ల మధ్య 57 వ సీన్లో బీజం పడేప్పుడు తప్పితే, రెండో టాపిక్ కి సంబంధించిన సీన్లు గానీ, దాని  ప్రస్తావన గానీ ఎక్కడా లే కపోవడాన్ని గమనించాలి. స్ట్రక్చర్ అంటే ఇదే.
ఈ మొదటి సీక్వెన్స్ స్ట్రక్చర్ చూద్దాం :
బిగినింగ్ -ఎత్తుగడతో సాధారణ స్థితి :
51.  శివ హత్యకి గురయిన మల్లి శవాన్ని హాస్పిటల్లో చూడ్డం, మల్లి నాన్నమ్మ సీఐని నిలదీయడం.
52.  శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడం, మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని  తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనడం.
55.  వీధిలో టీ స్టాల్ ఓనర్ భవానీ వసూళ్లు చేస్తున్న మామూళ్ళ గురించి వాపోతే, ఈ రోజు నుంచీ ఎవ్వరూ భవానీకి మామూళ్ళు ఇవ్వడానికి వీల్లేదని శివ ఆజ్ఞాపించడం.
56.  ఫ్యాక్టరీ  యజమాని కార్మికుల కోర్కెలు తీర్చకుండా సమ్మె ఆపమని భవానీకి డబ్బు అందించడం.
57.  కార్మిక నాయకుడు కృష్ణా రెడ్డి భవానీ దగ్గరకొచ్చి,  ఇలా సమ్మె ఆపితే తనకి చెడ్డ పేరొస్తుందని వాపోతే, చెప్పినట్టు చెయ్యమని భవానీ అనడం.  భవానీ దగ్గరికి నానాజీ వచ్చి,  మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ అంటే, శివని చంపెయ్యమని భవానీ ఆదేశించడం.

మిడిల్ – శివ మీద దాడితో అసాధారణ స్థితి– సంఘర్షణ :
58.  రాత్రి పూట శివ ఇంటిమీద భవానీ అనుచరుల మీద దాడి, వాళ్ళని ఎదుర్కొని శివ ఒకణ్ణి బందీగా పట్టుకోవడం.
59.  బందీగా పట్టుకున్న అనుచరుణ్ణి భవానీ దగ్గరికి తెచ్చి పడేసి- ఈ రోజునుంచి భవానీకి సంబంధించిన  ప్రతీదీ నాశనం చేస్తానని శివ ఇవ్వడం.
చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనడం.

60.  కల్లు కాంపౌండ్ మీద శివ గ్రూపు దాడి చేయడం.
61.  శివ దగ్గరికి కృష్ణా రెడ్డి వచ్చి సమ్మెకి సపోర్టు అడగడం, బదులుగా కార్మికుల సపోర్టు శివకే వుంటుందని అనడం.
62.  ఇది  భవానీకి తెలిసిపోయి- శివ కుటుంబం గురించి ఆరా తీయడం, ఆశాని శివ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకోవడం.
63.  భవానీ అనుచరులు ఆశాని కిడ్నాప్ చేస్తే శివ వచ్చి కాపాడుకోవడం.
67.  నానాజీ వచ్చి బార్ వాడు మామూళ్ళు ఇవ్వడం లేదనీ, ఏరియాలో ఎవ్వరూ కేర్ చేయడం లేదనీ భవానీకి చెప్పడం.
ఎండ్ – పరిష్కారం :
        71.  శివ మీద ఎందుకుచర్య తీసుకోవడం లేదని మాచిరాజు వచ్చి భవానీని తిట్టడం,  అహం దెబ్బ తిన్న భవానీ ఫైనల్ గా వారం రోజుల్లో ఫినిష్ చేస్తాననడం. భవానీ అనుచరుడు డబ్బు అడిగితే భవానీ వాణ్ణి కొట్టడం.
వివరణ :  

ఈ సీక్వెన్సులో మధ్య మధ్యలో శివ- ఆశాల ప్రేమా పెళ్ళీ తాలూకు సీన్లు; అన్న, వదిన, కీర్తి తాలూకు సీన్లూ డ్యూయెట్లూ వున్నాయి. ప్రధాన కథతో సంబంధం లేకుండా ఇవి సబ్ ప్లాట్ సీన్లూ – పాటలు. ఫస్టాఫ్ నుంచి ఈ సబ్ ప్లాట్ కంటిన్యూ అవుతోంది.

క రెండో సీక్వెన్స్  72-78 సీన్ల మధ్య 7 సీన్లతో నడుస్తుంది. రెండో సీక్వెన్స్ నిడివి ఎప్పుడూ తక్కువే వుంటుంది. ఫస్టాఫ్ లో  మిడిల్-1 కి రెండో సీక్వెన్స్ ని కూడా గమనిస్తే, అది 10 సీన్లతోనే వుంటుంది. కానీ మొదటి సీక్వెన్స్ 16 సీన్లతో వుంటుంది. ఫస్టాఫ్ లో రెండో సీక్వెన్స్ ఎప్పుడూ ఇంటర్వెల్ కి దారి తీసే పించ్ -1 దగ్గర ప్రారంభమైనట్టు, సెకండాఫ్ లో కూడా రెండో సీక్వెన్స్  ప్లాట్ పాయింట్ -2 కి ప్రేరేపించే పించ్ – 2 దగ్గరే ప్రారంభమ
వుతుంది. అందుకని వీటి నిడివి ఎప్పుడూ తక్కువే వుంటుంది. పించ్- 1, పించ్- 2 లకి దారితీసే సీక్వెన్స్ లెప్పుడూ చప్పున ముగుస్తాయి.
ఇప్పుడు చూద్దాం :  మొదటి సీక్వెన్స్ లోని 57 వ సీన్లోనే రెండో సీక్వెన్స్ టాపిక్ కి బీజం పడిందని పైన గమనించాం. గణేష్ ని పట్టుకునే టాపిక్. మొదటి సీక్వెన్స్ 71 వ సీనుతో ముగిసింది. ఈ సీను ముగింపులోనే రెండో సీక్వెన్స్ ప్రారంభమయ్యింది. ఎలాగంటే డబ్బడిగిన అనుచరుణ్ణి భవానీ లాగి కొట్టాడు. ఈ లాగి కొట్టడమే గణేష్ దొరికిపోవడమనే రెండో సీక్వెన్స్ కి ‘కీ’ ఇచ్చినట్టయ్యింది.

బిగినింగ్ -ఎత్తుగడతో సాధారణ స్థితి :
72. దెబ్బ తిన్న భవానీ అనుచరుడు చిన్నాకి కాల్ చేసి, పది వేలు  పట్టుకుని ఊర్వశి బార్ కి వస్తే గణేష్ ఆచూకీ చెప్తాననడం.
73. ఈ విషయం చెప్పడానికి శివ దగ్గరికి చిన్నా వెళ్తే శివ లేకపోవడం. 
మిడిల్ – అనుచరుడి హత్యతో అసాధారణ స్థితి– సంఘర్షణ :
        74. చిన్నా తనే బార్ కి వెళ్లి భవానీ అనుచరుణ్ణి కలవడం, అక్కడికే వచ్చేసిన భవానీ ఆ అనుచరుణ్ణి చంపడం, చిన్నా పారిపోవడం.
75. పారిపోతున్న చిన్నాని పట్టుకుని భవానీ అనుచరులు చంపెయ్యడం.
76. శివకి చిన్నా రాసిన చీటీ అంది బార్ కి వెళ్ళడం. 
ఎండ్ – పరిష్కారం :
        77. బార్ లో దాక్కున్న గణేష్ ని శివ పట్టుకుని కొట్టడం.
78.  గణేష్ ని  పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పడేసి శివ వెళ్ళిపోవడం.

లా ముగిసిన మిడిల్- 2 ని మనమొకసారి పరిశీలిస్తే, ఫస్టాఫ్ లో మిడిల్-1 లో కేవలం భవానీతో సంఘర్షిస్తూ వుండిన శివ, సెకండాఫ్ మిడిల్ -2 కి వచ్చేసి, భవానీని కాదు, అంతం చేయాల్సింది భవానీలాంటి మాఫియాల్ని తయారు చేస్తున్న వ్యవస్థని అనీ  తెలుసుకుని, ఆ మేరకు తన గోల్ ని మరింత విస్తరించడంతో పాత్ర చిత్రణకి సంబంధించి క్యారక్టర్ డెవలప్ మెంట్, గ్రోత్, మెచ్యూరిటీ ఇవన్నీ కనపడుతున్నాయి.
52 వ సీన్లో – ‘నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. మల్లిని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే, వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప, ఇంకేమీ జరగదు. ఈ భవానీ కాకపోతే రేపు గణేష్ భవానీ అవుతాడు, లేకపోతే ఇంకొకడు. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాటి గూండాల్ని పుట్టిస్తున్న వ్యవస్థని నాశనం చెయ్యాలి- గెలుస్తానో లేదో తెలీదు, కానీ ప్రయత్నిస్తాను-‘ అని సీఐ తో శివ అనడం పాత్ర మానసికంగా ఎదిగిందనేందుకు నిదర్శనం. ‘నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది…’అని ఒప్పుకోవడం ప్రేక్షకులకి ఎంతో కనెక్ట్ అవుతుంది. తప్పు చేయడంతో హీరో కూడా తమలాంటి సాధారణ మానవమాత్రుడే నన్న ఫీల్ తో ప్రేక్షకులు కరిగిపోతారు. అంతేగాక, వ్యూహం మార్చడం కోసం హీరో ఆలోచనలు ప్రేక్షకులకి తెలియాలి. ఇప్పటి సినిమాల్లో అరుపులు అరిచి నరకడమే తప్ప- ఆలోచనలు తెలిపి ప్రేక్షకుల్ని దగ్గర చేసుకునే విధానం లేదు.  భవానీ కూడా ఎంత చక్కగా తన వ్యూహం తాలూకు ఆలోచనలు ప్రేక్షకులకి తెలుపుతాడంటే- శివ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చాడని తెలిశాక – 57వ సీన్లో- ‘నానాజీ. మన బిజినెస్ లో ఎప్పుడూ ఎదుటివాడి దెబ్బ కోసం వెయిట్ చేయడం మంచిది కాదు, ముందు మన దెబ్బ పడిపోవాలి-’ అని! ఇలా చెప్పి రెండో ఇన్నింగ్స్ దాడులు ప్రారంభిస్తాడు.
వీటితో జతకూడే ఆశాతో రిస్కూ పెరిగి, పరిణామాల హెచ్చరికలూ రెండింత లయ్యాయి. అదే సమయంలో మిడిల్ -1 బిజినెస్ ప్రకారం ఏ యాక్షన్- రియాక్షన్ లతో కూడిన సంఘర్షణ ప్రారంభమయ్యిందో,  అది మరింత బలపడి మిడిల్ -2 లోనూ కొనసాగడం గమనించ వచ్చు.
ప్లాట్ పాయింట్ -2 ఎప్పుడూ కథ ముగించడానికి పరిష్కార మార్గం లభించే దృశ్యంతో వుంటుంది. అలా శివ గణేష్ ని పట్టుకుని కోర్టుకి అప్పగించడానికి పోలీసులకి సాయపడుతూ, వాణ్ణి తెచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేసే దృశ్యంతో ఈ మిడిల్ విభాగం స్ట్రక్చర్ పరిసమాప్తమవుతోంది.

-సికిందర్ 

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll