స్క్రీన్ ప్లే సంగతులు

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 : ఎండ్ తో అన్నీ ఎండ్ కావాలి!

screenplay-writingస్క్రీన్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసలు ఎండ్ ఎలా మొదలవుతుంది? ఎండ్ విభాగంలో జరిగే బిజినెస్ ఏమిటి? సీక్వెన్సు లేమిటి? ఎండ్ కల్లా కథలో ఏఏ అంశాలు ముగిసిపోవాలి? వీటన్నిటినీ వివరించుకుని ఈ ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాస పరంపరని ముగింపుకి తెద్దాం…
ముందుగా 14 వ అధ్యాయంలో రాసిన అంశాల్ని దగ్గర పెట్టుకుని, రెండిటినీ కలిపి చదువుకుంటే, ఎండ్ విభాగపు సైన్స్ నంతా బాగా అర్ధం జేసుకోవచ్చు. ఈ లింక్ ని క్లిక్ చేసి ముందుకు సాగండి : https://sikandercinemascriptreview.blogspot.in/2016_05_26_archive.html

స్క్రీన్ ప్లే కి ఎండ్ విభాగం అనేది మిడిల్ అంతమైన చోట ప్లాట్ పాయింట్ -2 నుంచి ప్రారంభమవుతుంది. దీన్నే క్లయిమాక్స్ అంటారు. క్లయిమాక్స్ అంటే చిట్ట చివర్లో పాజిటివ్ శక్తి ( ఏ జానర్ ని బట్టి అలాటి కథానాయకుడు/నాయిక), నెగెటివ్ శక్తి (ఏ జానర్ ని బట్టి అలాటి ప్రతినాయకుడు/నాయిక) మీద సాధించే అంతిమ విజయం. దీన్నే డా. పరుచూరి గోపాలకృష్ణ విస్తృతార్ధంలో ‘ఫలప్రాప్తి’ అన్నారు, లజోస్ ఎగ్రీ ‘రిజల్యూషన్’ అన్నారు. రెండూ ఒకటే. కానీ మన సినిమాల్లో ఇప్పుడు విస్తృతార్ధంతో ముగిసే సినిమాలు అంతగా రావడం లేదు. హీరో గోల్ ని సాధించే ఉద్దేశంతోనే కథలు ముగిసిపోతున్నాయి తప్ప, హీరో గోల్ తో పాటూ కథా ప్రయోజనాన్ని కూడా సాధిస్తూ ‘ఫలప్రాప్తి’ గా, ‘రిజల్యూషన్’ గా ముగియడం లేదు. ‘శివ’ దీన్ని దృష్టిలో పెట్టుకుంది. హీరో గోల్ కంటే కథా ప్రయోజనం ఉన్నతమైనది. కథా ప్రయోజనం కోసం హీరో గోల్ ని సాధించాలి తప్పితే, కథలో వ్యక్తిగత ప్రయోజనం కోసం కారాదు.
‘ప్రధానపాత్ర ముఖ్యోద్దేశమేమిటో ఆ దిక్కుగా ఆఖరి 30-40 నిమిషాల నడక వుండాలి, గెలుపోటముల మధ్య డోలాయమాన పరిస్థితి వుండాలి’ అన్నారు గోపాల కృష్ణ. ‘పతాక స్థాయికి చేరటానికి ముందు విషమ స్థితికి తీసుకు వెళ్ళాలి. ఇదే యాంటీ క్లైమాక్స్. ఇలా కథానాయికో, కథానాయకుడో ఇక ఆశయాన్ని సాధించలేరు అని నూటికినూరు శాతం నమ్మకం కలిగించటమే విషమ స్థితి. ఆ తర్వాత ఫలప్రాప్తి సాధించాలి’ అని కూడా అన్నారు తన ‘తెలుగు సినిమా సాహిత్యం- కథ, కథనం, శిల్పం’ అన్న పుస్తకంలో.
‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ లో- ఎండ్ కుండాల్సిన వరస క్రైసిస్, క్లయిమాక్స్, రిజల్యూషన్ అన్నారు లజోస్ ఎగ్రి. ‘డెత్ ఈజ్ క్లయిమాక్స్, బిఫోర్ డెత్ ఈజ్ క్రైసిస్’ అన్నారు. అంటే చావుకి ముందు సంక్షుభిత పరిస్థితినీ – పోరాటాన్నీ చూపకుండా అకస్మాత్తుగా హీరో వచ్చేసి, ఒక్క పోటుతో విలన్ ని పొడిచి చంపేసి- ఐపోయింది కథ అంటే ఎంత దారుణంగా వుంటుందో, ఆ సంక్షుభిత పరిస్థితినీ – పోరాటాన్నీ చూపిస్తూ చంపేశాక కూడా, వెంటనే శుభం కార్డు వేయడమూ అంతే అన్యాయంగా ఉంటుందన్నమాట. ‘జనతా గ్యారేజ్’ ఆకస్మిక ముగింపులో ఇదే చూశాం. ఇంత భారీ కథకి కథా ప్రయోజనం అన్న సంగతే ఆలోచించలేదు.
అలాగే ‘హైపర్’ లో కథా ప్రయోజనం ఆకస్మికంగా క్లయిమాక్స్ లో వూడి పడుతుంది. అంతవరకూ జరిగిన కథలో దీని ఊసే వుండదు- హీరో గోల్ తో మిళితమై కూడా వుండదు. హీరోతో సంబంధం లేకుండా హీరో తండ్రీ- విలన్ లు కలిసి, వాళ్లకి వాళ్ళు మొదలెట్టుకునే క్లయిమాక్స్ లో ‘సంతకం’ గురించి మొత్తం ప్రభుత్వోద్యోగులంతా తిరగబడే వృత్తాంతం కథా ప్రయోజనం అన్పించదు. ఈ కథా ప్రయోజనం గురించి హీరో ఎక్కడా మాట్లాడడు.
కథా ప్రయోజనమనేది కథకి ఆత్మ (సోల్) లాంటిది. అది కథలో అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది, వుండాలి. ‘శివ’ కథా ప్రయోజనం కళాశాలల్లో మాఫియాల జోక్యాన్ని రూపు మాపడం. అంతేగానీ ఎవరో మాఫియా ప్రతినిధి జేడీ అనేవాడు హీరోయిన్ని తాకినందుకు హీరో పగబట్టిన వ్యక్తిగత కథ కాదు. శివ తన గ్రూపులోని మల్లిని భవానీ మనుషులు చంపినప్పుడు కూడా ఇంకింత ఎక్స్ టెండ్ చేసిన కథా ప్రయోజనంతో కూడుకున్న మాటలే అంటాడు. మల్లిని చంపాడని తను భవానీని చంపితే, రేపింకో భవానీ పుట్టుకొస్తాడు, వాణ్ణి చంపితే ఇంకో భవానీ పుట్టుకొస్తాడు- ఇలాకాకుండా ఇలాటి భవానీలని పుట్టిస్తున్న వ్యవస్థనే నాశనం చేయాలంటాడు. ఇదీ కథా ప్రయోజనం, విస్తృతార్ధంలో ముగింపు, ఫలప్రాప్తి, రిజల్యూషన్ వగైరా వగైరా. ఇది జరిగిందా లేదా అనేది ముగింపులో చూడాలి.
హీరో సామాజిక ప్రయోజనాన్ని చూస్తాడు. కానీ వ్యవస్థ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటుంది. బిన్ లాడెన్ ని చంపడం వల్ల టెర్రరిజం సమస్య సమసిపోలేదు. బిన్ లాడెన్ ని చంపకుండా అతడి భావజాలాన్ని ఎలా చంపెయ్యొచ్చో, తద్వారా టెర్రరిజానికి ఎలా శాశ్వతంగా తెర దించవచ్చో- ఒక హాలీవుడ్ రచయిత నుంచి సీఐఏ తీసుకున్న బ్లూ ప్రింట్ ని ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆ హాలీవుడ్ రచయిత సరీగ్గా సినిమాలో శివ చెప్పిన మాటలే చెప్పి హెచ్చరించాడు- మీరు బిన్ లాడెన్ చంపితే వందల మంది బిన్ లాడెన్ లు పుట్టుకొస్తారని. కానీ వ్యవస్థకి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం- సమాజం, ప్రపంచం ఎలా పోతే ఏంటి. అందుకని బిన్ లాడెన్ భావజాలం నాశనం కాకుండా బిన్ లాడెన్ హతమయ్యాడు. అలాగే గ్యాంగ్ స్టర్ నయీంని చంపేశాక వాణ్ణి సృష్టించిన వ్యవస్థని శిక్షించగలరా? వ్యవస్థ ఎప్పుడూ వ్యక్తిగత లాభాలే చూసుకుంటుంది- కానీ కథల్లో హీరో అలాకాదు- సామాజిక ప్రయోజనాన్నే కాంక్షిస్తాడు.
‘శివ’ లో భవానీ అనుచరుడు గణేష్ కూడా ఇలాటి నయీం లాంటి వాడే. వీణ్ణి చట్టానికి పట్టిస్తే – భవానీతో బాటు, వీడి వెనుక వ్యవస్థ మొత్తాన్నీకూడా వీడి ద్వారా నాశనం చేయవచ్చని అంతిమంగా శివ కనుగొన్న పరిష్కారమార్గం. అందుకే ప్లాట్ పాయింట్ టూ దగ్గర గణేష్ ని పట్టుకుని లాకప్ లో వేయించాడు. ఇక్కడ్నించీ వ్యవస్థ నాశనమయ్యే పాడు కాలం మొదలయ్యింది. వ్యవస్థకి సింబల్ మాచిరాజు.

కథకైనా ముగింపు ప్రారంభంలోనే దాగి ఉంటుందని చెప్పుకున్నాం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర శివ జేడీని కొట్టి కథ ప్రారంభిస్తున్నప్పుడు, అందులో ముగింపు ఏమిటీ అని చూస్తే- ఆటోమేటిగ్గా భవానీ అంతమేనని తెలిసిపోతుంది. అయితే ప్లాట్ పాయింట్ వన్ ని ప్లాట్ పాయింట్ టూ కి తాళం చెవిగా కూడా 14 వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఈ మొత్తం హీరో ఎదుర్కొంటున్న సమస్యకి హీరో పరిష్కార మార్గాన్ని కనుగొని దాంతో క్లయిమాక్స్ ప్రారంభిస్తాడు. ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ హీరోకి పరిష్కార మార్గం ఎలా, ఎక్కడ్నించీ దొరుకుతుంది? అన్నిటికీ సమాధానం సృష్టి మూలమే. ప్లాట్ పాయింట్ వన్నే.
ముందుగా తాళం ఏదో తెలిస్తే దాన్ని విప్పే తాళం చెవి ఏదో తెలుస్తుంది. తాళం హీరో గోల్ లోని అంశం అనుకుంటే, దాన్ని చేరుకునే ద్వారాల్ని తెరిచేదే తాళం చెవి అనే పరిష్కార మార్గం. ఏ జానర్ కి చెందిన కథకైనా ఈ ఏర్పాటు వుంటుంది. లేదంటే అది తోచినట్టూ రాసుకున్న ఏదో ‘కత’ అయి వుంటుంది. గోల్ లోని అంశానికి సరిపడా తాళం చెవి లేకపోతే, ఇంకేదో చేసి బలవంతంగా గోల్ ద్వారాలు తెరిస్తే అది దొంగ దారి అవుతుంది. ఉంగరం పడిపోయింది…పోతే పోనీ… హృదయం మాత్రం పదిలం పదిలం … అనే పాత పాట వున్నట్టు- తాళం చెవి దొరకని కథ ఏమంత పదిలంగా వుండదు. అసలు తాళం చెవులే లేని కథలు తయారవుతున్నాయి.
వెతికితే బిగినింగ్ లేదా మిడిల్ విభాగాల్లోనే ఈ తాళం చెవి దొరుకుతుంది. ‘శివ’ లో హీరో గోల్ వ్యవస్థ అయినప్పుడు దాన్ని సాధించే తాళం చెవి గణేషే అవుతాడు తప్ప భవానీ కాదు, మాచిరాజూ కాదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడ్డ గోల్ లోని అంశం (కథా ప్రయోజనం) వ్యవస్థ నాశనమే అయినప్పుడు ముందుగా ఆ వ్యవస్థ నాశన క్రమం తెలియాలి. ఏం చేస్తే అలాటి వ్యవస్థ నాశనమవుతుందో సామాజిక స్పృహతో, సంయమనంతో, అర్ధవంతంగా పరిశీలించాలి. (ఇతర జానర్ల కథలకి కూడా ఏంచేస్తే సమస్య పరిష్కారమౌతుందో ఇలా సైంటిఫిక్ గానే విస్తృతార్ధంలో ఆలోచించాలి). బిన్ లాడెన్ ని చెంపేస్తేనే అలాటి వ్యవస్థ నాశనం అవుతుందనుకుంటే భవానీని కూడా చంపెయ్యొచ్చు. అలా భవానీని చంపిన పాలకులకి తిరిగి ఓట్లు పడతాయేమోగానీ, ఈ అవగాహ
నారాహిత్యం వల్ల సినిమాలో హీరోకి మాత్రం టికెట్లు తెగవు. ఎందుకంటే ఇంతకి ముందే చెప్పుకున్నట్టు, హీరో దృక్పథం దూరదృష్టితో కూడుకుని సువిశాలమైనదై వుంటుంది. పాలకుల్లాగా హ్రస్వ దృష్టితో వ్యక్తగత, పార్టీగత లాభాలు చూసుకోడు. ‘శివ’ లో హీరో భవానీని చంపలేదని కాదు, చంపాడు. వ్యవస్థకి సింబలైన మాచిరాజు నాశనమయ్యాకే భవానీని చంపాడు. పైన చెప్పుకున్న హాలీవుడ్ రచయిత కూడా బిన్ లాడెన్ భావజాలాన్ని నాశనం చేశాకే బిన్ లాడెన్ ని వురి తీయమన్నాడు. బిన్ లాడెన్ భావజాలాన్ని ఎలా నాశనం చెయ్యొచ్చో చాలా సైంటిఫిక్ గా చెప్పాడు.
అలా వ్యవస్థ నాశనమవ్వాలంటే గణేష్ తోనే నరుక్కురావాలని అంత సైంటిఫిక్ గా శివ ఆలోచించాడు గనుకనే, ప్లాట్ పాయింట్ టూ అనే తాళాన్ని బిగినింగ్ విభాగంలోనే గణేష్ రూపంలో తచ్చాడుతూ కన్పించిన తాళం చెవిని పట్టుకుని తెరిచాడు. గణేష్ ని పట్టుకుని లాకప్ లో వేయించే చర్యతో, సమస్యకి పరిష్కారమార్గాన్ని సుగమం చేసుకున్నాడు. ఏ జానర్ కథ కైనా ఇలాటి ఏర్పాటుని బిగినింగ్ లేదా మిడిల్ విభాగాల్లోనే వెతికితే తప్పకుండా దొరుకుంతుంది. మరొకటేమిటంటే, కథ అంటే ఆర్గ్యుమెంట్ అని కూడా చెప్పుకున్నాం. ఈ ఆర్గ్యుమెంట్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రశ్నని సంధిస్తుంది (సంధించ లేదంటే అది కథవదు. స్టేట్ మెంట్ తో కూడిన, సినిమాకి పనికి రాని ఏదో కేవల ‘గాథ’ అవుతుంది). ఇలా లేవనెత్తిన ప్రశ్నకి ముగింపులో సమాధానం చెప్పి తీరాలి. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర శివ జేడీని సైకిలు చెయినుతో ఆ యెత్తున బాదడం మొదలెట్టాడంటేనే ఎంతో సవాలు భవానీ మీద. ఒక మామూలు కుర్రాడు భవానీ తోనే పెట్టుకున్నాడే ఇప్పుడేమిటీ అన్న కంగారు పుట్టించే ప్రశ్న. ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ మలుపు యాక్షన్ ద్వారా తెలియ జేస్తేనే ప్రశ్న బలంగా, కంగారు పుట్టించేదిగా వుంటుంది ఆ విజువల్ ఎఫెక్ట్ వల్ల. ప్రేమ కథల్లో లాగా మాటా మాటా అనుకుని విడిపోయే వెర్బల్ ప్లాట్ పాయింట్ బలహీనంగా వుంటుంది, సరైన ప్రశ్న కూడా పుట్టించకుండా. ఇదే యాక్షన్ లో చూపిస్తే పుట్టాల్సిన కంగారంతా పుడుతుంది. ప్రశ్న ఎంత కంగారు పుట్టిస్తే క్లయిమాక్స్ అంత బలంగా వుంటుంది. ఎండ్ విభాగం బలహీనంగా వుందంటే దాని రుగ్మతలు బిగినింగ్ విభాగంలో ఉన్నట్టేనని ఏనాడో ప్రఖ్యాత దర్శకుడు బిల్లీ వైల్డర్ చెప్పనే చెప్పాడు. ఇలాటి పరిశీలనలు చేసి చెప్పే దర్శకులు మనకున్నారా? తమ గురించి ఏదో ఫీలైపోతూ ఏటా తొంభై శాతానికి తగ్గకుండా ఫ్లాపులు ఇవ్వడంలోనే వాళ్లకి ఆసక్తి. ఇంతాచేసి టాలీవుడ్ కి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇదే!

ణేష్ ని లాకప్ లో పడేశాక ‘శివ’ ఎండ్ విభాగం ఈ మేకప్ తో వుంటుంది…
79. పోలీస్ లాకప్ లో వున్న గణేష్ ని నానాజీ కలవడం, తనని బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ అనడం.
80. ఈ విషయం నానాజీ భవానీకి చెప్పేయడం, గణేష్ ని లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
81. పోలీస్ స్టేషన్ లో గణేష్ ని చంపడానికి ప్రయత్నించిన భవానీ అనుచరుల్ని శివ చంపడం.
82. శివ సీఐ కి కాల్ చేసి భద్రత కోసం గణేష్ ని తన ఆధీనంలో వుంచుకుంటాననీ, రేపు కోర్టు దగ్గర అప్పగిస్తాననీ అనడం.
83. వారం రోజుల్లో శివ సంగతి చూస్తానని చెప్పి ఏమీ చేయలేనందుకు భవానీ మీద మాచిరాజు మండిపడడం.
84. మాచిరాజు శివ ని కలిసి భవానీకి వ్యతిరేకంగా మాట్లాడి శివని తనతో కలుపుకోవడానికి ప్రయత్నించడం.
85. శివని ఆపడం మాచిరాజు వల్ల కూడా కాలేదనీ, గణేష్ ని శివ ఎక్కడ దాచాడో తెలుసుకోవాలంటే శివ కదలికల మీద నిఘా వుంచాలనీ నానాజీని భవానీ ఆదేశించం.
86. కీర్తికి బాగాలేదని అన్న దగ్గర్నుంచి కాల్ వస్తే బయల్దేరిన శివని భవానీ మనుషులు అనుసరించడం.
87. అన్న దగ్గరికి వెళ్ళిన శివ ద్వారా అన్నఇంటి అడ్రసు భవానీ అనుచరులకి తెలియడం.
88. ఈ విషయం నానాజీ భావానీకి చెప్తే, కీర్తిని తీసుకు రమ్మని భవానీ ఆదేశించడం.
89. శివ అన్న ఇంట్లోంచి భవానీ అనుచరులు కీర్తిని అపహరించడం.
90. శివ కోర్టులో సీఐ కి గణేష్ ని అప్పగించడం, అక్కడే అన్న కూతురి అపహరణ గురించి తెలియడం.
91. కీర్తిని అపహరించే లోగా శివ గణేష్ ని కోర్టుకి అప్పగించాడనీ, భవానీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నానాజీ భవానీతో అనడం, బందీగా వున్న కీర్తి మీద భవానీ కన్నేయడం.
92. శివ అన్న ఇంటిదగ్గరికి వెళ్లేసరికి అక్కడ కీర్తి శవం వుండడం.
93. శివ భవానీ దగ్గరికి వెళ్లేసరికి అతను మాచిరాజు దగ్గరికి వెళ్ళాడని తెలియడం.
94. తన మీద అరెస్ట్ వారెంట్ మాఫీ చెయ్యనందుకు, తన గురించి చులకనగా
మాట్లాడినందుకూ భవానీ మాచిరాజుని చంపెయ్యడం.
95. పారిపోతున్న భవానీని శివ వెంటాడి చంపడం.

***సమాప్తం ***
(మిగతా వచ్చే వారం)
-సికిందర్

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll