టాలీవుడ్ రివ్యూస్

‘మేడ మీద అబ్బాయి’ : కామెడీకి సింపుల్ సంగతులు!

ద‌ర్శ‌క‌త్వం : జి. ప్ర‌జిత్‌
తారాగణం : అల్ల‌రి న‌రేష్‌, నిఖిలా విమ‌ల్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, హైప‌ర్ ఆది, స‌త్యం రాజేష్‌, జ‌య‌ప్ర‌కాష్‌, తుల‌సి, సుధ‌, త‌దిత‌రులు
కథ – స్క్రీన్ ప్లే : వినీత్ శ్రీనివాసన్, మాటలు : చంద్రశేఖర్
సంగీతం : షాన్ రెహ‌మాన్, ఛాయాగ్రహణం : ఉన్ని ఎస్‌.కుమార్‌
బ్యానర్ : జాహ్న‌వి ఫిలింస్‌, నిర్మాత : బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్‌
విడుదల : సెప్టెంబర్ 8, 2017meda-mida-abbai

ల్లరి నరేష్ అపజయాల బాట పట్టి ఆరేళ్ళయ్యింది. 2012 లో ‘సుడిగాడు’ తర్వాత సుడి లేకుండా పోయింది. బిగ్ స్టార్స్ కూడా సినిమాల్లో ఫస్టాఫ్ కామెడీలు చేయడానికి కేటాయించుకోవడంతో, తన ఏకైక కామెడీ హీరోగిరీకి ప్రమాదం వచ్చి పడింది. జంధ్యాల, ఈవీవీ ల్లాగా కామెడీలు తీసే దర్శకులు లేకపోవడంతో, నరేష్ నటిస్తున్న సినిమాలు అల్లరైపోసాగాయి. తెలుగులో కామెడీ దర్శకుల లోటు ఎంత వుందో వరసగా ఫ్లాపైన అల్లరి నరేష్ పన్నెండు సినిమాలని చూస్తే చాలు. ఈ పరిస్థితుల్లో అటు మలయాళ తీరంనుంచి ఋతుపవనాలు వచ్చినట్టు ప్రజిత్ వచ్చి వాలిపోయాడు. నరేష్ మారిపోయాడు. రొటీన్ ప్రేమలు, పాటలు, పేరడీలు, టెంప్లెట్ కామెడీలు తీసి అవతల పెట్టి, మనసున్న కామెడీ చేసుకుందామని, సైబర్ నేరగాళ్ళ సమస్యని కాస్త సెన్సిబుల్ గా చెబుదామని ‘మేడ మీద అబ్బాయి’ గా దిగాడు. ఒక రొటీన్ కి అలవాటయ్యాక వెంటనే మార్పు ఆకట్టుకోదు. అందులోనూ మలయాళ వెరైటీ ఏదోగా అన్పిస్తుంది. పైగా దర్శకుడు కూడా మలయాళీ. అయినా సరే, సీరియస్ గా ఇన్వాల్వ్ చేసి వాస్తవికతకి దగ్గరగా సింపుల్ కామెడీతో తనపని తాను చేసుకుపోతుంది. ఒక సెల్ఫీ జీవితంలో ఎంత పనిచేస్తుందో మలుపులు తిప్పేస్తూ చెప్పుకు పోతుంది…
కథ
చదువంటే శ్రద్ధ లేని శీను (నరేష్) ఎన్నటికీ గట్టెక్కలేని బీటెక్ బ్యాక్ లాగ్స్ (24) తో వుంటాడు. ఇంకోసారి పరీక్షలు రాసి గోదావరి జిల్లా పల్లెటూళ్ళో ఇంటికొస్తాడు. కిరాణా షాపు నడుపుకుంటూ అప్పుచేసి చదివించినా ప్రయోజకుడు కాని కొడుకు మీద పీకలదాకా వుంటుంది తండ్రి (జయప్రకాష్) కి. తల్లి (తులసి) వెనకేసుకొస్తూంటుంది. మేడ మీద గది వుంటుంది. ఆ గదిలో సెటిలై తిని పడుకోవడం తప్ప ఏమీ చేయడు. తండ్రి తిడుతూంటే ఇక లాభం లేదని, చదువు తనకి అబ్బదని, సినిమా డైరెక్టర్ అవుదామనుకుంటాడు. దాంతో తన దర్జా చూసి తండ్రి గర్వపడతాడనుకుంటాడు. వూళ్ళో నల్గురు ఫ్రెండ్స్ వుంటారు. వాళ్ళల్లో బండ్ల బాబ్జీ (హైపర్ ఆది), (కార్తీ) సత్యం రాజేష్ లు ముఖ్యులు. వాళ్ళతో ప్లాన్ చేసి షార్ట్ ఫిలిం తీయాలనుకుంటాడు. సినిమాల్లోకి అదొక సర్టిఫికేట్ అవుతుందనుకుంటాడు. ఆ తీసిన షార్ట్ ఫిలిం తాగి ఎంజాయ్ చేస్తూంటే వాగులో కొట్టుకుపోతుంది. అప్పుడు పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి సింధు (నిఖిలా విమల్) పేరెంట్స్ తో వచ్చి దిగుతుంది. ఆమె మీద మనసు పారేసుకుంటే ఛీ కొడుతుంది. అంతలో రిజల్ట్స్ వచ్చి ఫెయిలవుతాడు. దాంతో రైలెక్కి టాలీవుడ్ పారిపోతాడు. అదే ట్రైన్లో వుంటుంది జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్తూ సింధు. ఆమెకి తెలీకుండా ఒక సెల్ఫీ తీసుకుని బండ్ల బాబ్జీకి పంపుతాడు. కానీ వారం పాటు తిరిగినా టాలీవుడ్ లో ఎవరూ గేట్లోంచి రానివ్వరు. తిరిగి ఇంటికొచ్చేస్తాడు. వచ్చేస్తే, సింధుని ఏం చేశావని వూళ్ళో జనం తిరగబడతారు సెల్ఫీ చూపించి. ఆమె అదృష్యంతో తనకేం సంబంధం లేదన్నా విన్పించుకోరు, తండ్రి గెంటేస్తాడు. సింధు ఏమయ్యింది? ఆమెతో తనకెలాంటి సంబంధం లేదని శీను ఎలా నిరూపించుకున్నాడు? సింధు అసలు కథ ఏమిటి? హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ యుగంధర్ (అవసరాల శ్రీనివాస్) సాయంతో ఆమెని పట్టుకుని శీను తెలుసుకున్న రహస్యాలేమేమిటి? ఆమె శీనుకి దక్కిందా లేదా? …ఇవన్నీ తెలియాలంటే వెండి తెరని ఆశ్రయించాల్సిందే.
ఎలావుంది కథ
మలయాళ ‘ఒరు వడక్కం సెల్ఫీ’ కి రీమేక్. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వర్చువల్ స్నేహలతో అవతలి వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అమ్మాయిలకి ఓ విన్నపం చేసే కథ. రాద్ధాంతం చెయ్యకుండా సింపుల్ గా, వాస్తవికంగా చేప్పే కథ. ఒకప్పుడు కలం స్నేహాలుండేవి. అప్పుడు లేని అనర్ధాలు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి ఆన్ లైన్ స్నేహాలతో, ప్రేమలతో. ఇది స్థూలంగా కామెడీ కథలా అన్పించినా, జానర్ మిక్స్ చేసిన కామిక్ – రోమాంటిక్ – థ్రిల్లర్. సున్నిత హాస్యమే దీని బలం. 2015 లో మలయాళంలో పెద్ద హిట్టయిన కథ.
ఎవరెలా చేశారు
అల్లరి నరేష్ మారిపోయాడు. సినిమాతోనే కాదు, శరీరంతో కూడా. బరువు పెరిగి మొహంలో ఆకర్షణ తగ్గింది. అర్జెంటుగా బరువు తగ్గాల్సి వుంటుంది. ఇలాగే బొద్దుగా వుంటే కామెడీ హీరో లుక్ పోయి, రాముడు మంచి బాలుడు టైపుకి సర్దుకోవాల్సి వస్తుంది. ఈ తరహా పాత్ర, సినిమా తనకెంత మేలు చేస్తుందో చెప్పడం కష్టమే. కానీ కీడు మాత్రం చేయదు. అయితే ఈమధ్య తన సినిమాలు చూడ్డం మానేసిన ఫ్యామిలీలు విశేష సంఖ్యలో దీనికి రావడం, ఇబ్బంది పడకుండా చూడడం ఒక విజయమే. కామెడీ కైనా క్వాలిటీని నమ్ముకుంటే ప్రయోగాలు చేయడం సమస్యనిపించుకోదు. అన్నితరగగతుల ప్రేక్షకులు మారుతున్నారు. కృత్రిమ ఫార్ములా సినిమాలు ఇంకెన్నాళ్ళు చూస్తారు. నరేష్ చేసిన ఇంకోమంచి పని, ఒరిజినల్ దర్శ కుడీకే ఈ రీమేక్ ని అప్పగించడం. హీరోయిన్ నిఖిలది ఒక సమస్యతో సైలెంట్ గా వుండే పాత్ర. ఉండుండి ఆ మౌనం బ్రద్దలయ్యే చివరి దృశ్యాలతో తారాస్థాయికి చేరింది. ఆన్ లైన్లో ప్రేమించిన వాడితో చివరిదాకా ఆమె విశ్వాసం అతి పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ నే, మిస్టరీనే క్రియేట్ చేస్తుంది. మలయాళంలో సినిమాలు వూహించుకుని పాత్రల్ని దిగుమతి చేసుకోరు. చుట్టూ ఎవడేం చేస్తున్నాడో కనిపెట్టి సినిమాల్లో పెట్టేస్తారు. అందుకే సినిమాలు కల్తీ లేని కల్ట్ సినిమాలు. మూడో పాత్ర హైపర్ ఆదిది. ఇతను లేకుండా సినిమాని వూహించడం కష్టమే. వండర్ఫుల్ కమెడియనితను. చివరి దాకా ఒక్కో డైలాగుకి అందరూ నవ్వడమే. పైకొస్తాడు. అవసరాల శ్రీనివాస్ డిటెక్టివ్ యుగంధర్ పాత్ర పోషించాడు. అసలు డిటెక్టివ్ పాత్రే తెలుగు సినిమాల్లో వుండదు, మలయాళ దర్శకుడు కాబట్టి తెలుగులోకి కూడా తేగలిగాడు. ఈ పాత్ర కొంత హాస్యాన్ని జోడించి పోషించాడు శ్రీనివాస్. ఈ పాత్ర కూడా సస్పెన్స్ పాత్రే. చివర్లోగానీ తెలియదు అసలు ఇతనెవరో. ఇంకా జయప్రక్షాష్, తులసి, సుధా, సత్యం రాజేష్ తడితులన్దరివీ సహజ పాత్రలే. మాటలో చేతలో ఫార్ములా డ్రామాల్లేవు, కృత్రిమత్వం లేదు. ఈ సినిమా ఒరిజినల్లోని ఫ్రేముకి ఫ్రేము, డైలాగుకి డైలాగు పక్కా అనుసరణే. కెమెరా వర్క్, లొకేషన్స్ చాలా పోయెటిక్ గా వున్నాయి –చిత్రీకరణలో వెలుగు నీడల పోషణతో. ఆరోగ్యకరమైన హాస్యంతో క్రియేటివ్ డైలాగులు – విసుర్ల రూపంలో తెగ నవ్విస్తూంటాయి. మలయాళంని తెలుగు చేసిన డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ పైకొస్తాడు – టెంప్లెట్ డైలాగులు సినిమాలకంటూ పెట్టుకున్న మసాలా డైలాగులూ రాయకుంటే. ప్రజిత్ దర్శకత్వం ఉన్నతంగా వుంది.
చివరి కేమిటి?
కామెడీగా మొదలై, మిస్టరీగా మారి, సస్పన్స్ థ్రిల్లర్ గా సాగే, ముగిసే, సజాతి జానర్ల వాడకం ఈ సాదా కథని నిలబెట్టింది. హీరో హీరోయిన్ల మధ్య ఎక్కడా ప్రేమ వుండదు. ఆమె దొరికాక, ఆమె సమస్య తీర్చడానికి తను – డిటెక్టివ్ – ఫ్రెండ్ – చేసే ప్రయాణం సెకండాఫ్ సగం నుంచి ఒకెత్తు. కథ ఒక్కో పొర విప్పుకుంటూ, కొత్త విషయాలు కలుపుకుంటూ, ఆద్యంతం కదలకుండా కూర్చోబెడుతుంది. దీనికి ఉప కథలు అవసర పడలేదు. అతి పెద్ద రహస్యమంతా చివర్లో ఓపెనవుతుంది. పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ ఎంటర్ టైనర్ ఇది. లవ్, పాటలు, డాన్సులు, ఫైట్లు, వూర కామెడీ మాస్ డైలాగులు, వేషాలూ కోరుకునే వాళ్ళకి ఇది నచ్చక పోవచ్చు.

-సికిందర్

Comments

comments

Teanding

Latest

Song Making

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll