టాలీవుడ్

కిలో టమోటా ధర కే సినిమా టిక్కెట్

jawaan-raviటికెట్‌ ధర రూ.100.. ఇది కిలో టమోటా ధర. దయచేసి థియేటర్లలోనే సినిమాలు చూడండి. దీని వల్ల మీరు మమ్మల్ని ప్రోత్సహించిన వారు అవుతారు అంటున్నారు దర్శక,రచయిత బి.వియస్ రవి. తాజాగా ఆయన డైరక్ట్ చేసిన ‘జవాన్‌’ సినిమా విడుదలైన రోజే పైరసీ వచ్చేస్తోందని దర్శకుడు బీవీఎస్‌ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రవి మాట్లాడుతూ…‘‘హీరోలు మా కోసం భాగస్వాములుగా మారుతున్నారు. కలెక్షన్స్‌ వస్తే డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతీ శుక్రవారం మాకు గుండెలు పగిలిపోతున్నాయి. శుక్రవారం మ్యాట్నీకే పైరసీ వచ్చేస్తే.. మేం ఏం చేయాలి. ఈ కళ చచ్చిపోతోంది. టికెట్‌ ధర రూ.100.. ఇది కిలో టమోటా ధర. దయచేసి థియేటర్లలోనే సినిమాలు చూడండి. దీని వల్ల మీరు మమ్మల్ని ప్రోత్సహించిన వారు అవుతారు’’అన్నారు.

అలాగే ..‘‘టూరిస్ట్‌ బస్సుల్లో పైరసీలు వేసేస్తున్నారు. బస్సు కండీషన్‌ బాగుందా.. అని ప్రభుత్వం ప్రశ్నిస్తే సరిపోతుందా..? పైరసీ వీడియోలు వేస్తున్న డ్రైవరు, కండక్టర్‌, బస్సు యజమానులను ఏం అనాలి. మనదేశంలో పైరసీ నిబంధనలు చాలా ఉన్నాయి. చూసిన వారిని, చేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. దయచేసి మా సినిమా ‘జవాన్‌’ (ఇంటికొక్కడు) పైరసీని ప్రోత్సహించకండి’’ అంటూ విజ్ఞప్తి చేశారు.

‘జవాన్‌’..‘ఇంటికొక్కడు’ అనేది ట్యాగ్ లైన్. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించారు. మెహరీన్‌ హీరోయిన్. ప్రసన్న విలన్ పాత్ర పోషించారు. అరుణాచల్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. దిల్‌రాజు సమర్పించారు. అయితే ఈ సినిమా పైరసీ వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యజమానులు చాలా నష్టపోతున్నారని దర్శకుడు బీవీఎస్‌ రవి ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల జీవితం సాఫీగా సాగేది కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియోను నిర్మాణ సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.

‘‘జవాన్‌’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘అర్థవంతమైన సినిమా చేశారు’ అని అందరూ ప్రశంసించాలి అనుకొని చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. కానీ, మా ఆనందం ఎంతోసేపు ఉండలేదు. రెండేళ్లు కష్టపడి ఈ కథ రాశా. ఓ హీరోని ఒప్పించి, 24 గంటలు ఆయనతో ప్రయాణం చేసి, ఆయన సహకారంతో నిర్మాతను కలిశాను. సినిమా కోసం నిర్మాత డబ్బు కుమ్మరించారు. యూనిట్‌లోని ప్రతి విభాగం వారు రక్తం చిందించి, ఈ సినిమా తీశాం. మేకింగ్‌ వీడియో చూస్తే మీకు మా కష్టం తెలుస్తుంది. ముందుగా ‘జవాన్‌’ను సెన్సార్‌కు చూపించాం. చాలా బాగుందని అభినందించారు. మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. సినీ ప్రముఖులు ఫోన్లు చేసి ప్రశంసించారు. కానీ మా ఆనందం గాలిలో పెట్టిన దీపంలా తయారైంది. సినిమా విడుదలైన రోజు మాట్నీ షోకే పైరసీ వచ్చేసింది’’.

‘‘సినిమా వ్యాపారం 10-20 శాతం లాభాలతో నడుస్తుంటుంది. పంపిణీదారులు, థియేటర్‌ యజమానులు.. ఇలా చాలా మంది ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇవ్వాలని ఎంతో శ్రమించి, డబ్బులు పోగు చేసుకుని ఖర్చు పెడుతుంటారు. ప్రతి వృత్తికి విలువ ఇస్తున్నారు.. సినిమా వృత్తికి ఇవ్వరు ఎందుకు? మాకూ కుటుంబాలు ఉన్నాయి. పైరసీ అనే రోగం బాగా వ్యాపించి పోతోంది. దీన్ని ప్రోత్సహించడం చాలా పాపం. కంప్యూటర్లు, ఫోనుల్లోనే సినిమా చూసేస్తున్నారు. ఇది కాదు కదా సినిమా అంటే.. అదో అనుభూతి. కోట్లు కుమ్మరించిన మేం ఏమైపోవాలి?’’.

‘‘వంద మంది కలిస్తే ఓ సినిమా. అంటే వంద కుటుంబాలు కలిస్తే సినిమా.. పైరసీ వచ్చేస్తే కలెక్షన్స్‌ తగ్గిపోతాయి. తగ్గిపోతే బడ్జెట్‌ తగ్గిపోతుంది. దీంతో అందరి జీవితాలు రోడ్లపైకి వచ్చేస్తాయ్‌. ‘సినిమా బాగుంది, కానీ పైరసీ వచ్చేసింది ఏంటి సర్‌ మా పరిస్థితి’ అంటున్నారు ఎగ్జిబిటర్లు. కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి సర్‌ అని నిర్మాతని అడిగితే ‘పైరసీ కలెక్షన్స్‌ బాగున్నాయి’ అంటున్నారు. ఆవేదన, బాధ, ఆవేశం.. అన్ని కలిసి.. మేం బతకాలి అని చెబుతున్న మాటలు ఇవి’’ అంటూ చెప్పుకొచ్చారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll